▪️ పంపన జాతీయ పురస్కార ప్రదానం – సాహిత్యవేత్తలకు సత్కారం
▪️ ట్యాంక్‌బండ్‌పై పంపన విగ్రహం ప్రతిష్ఠించాలి
▪️ మాతృభాషను మరచితే మనుగడ లేదు
▪️ ముఖ్య అతిథిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగర్ రావు

హైద‌రాబాద్: తెలంగాణ ఆది కవి గా ప్రసిద్ధి చెందిన పంపన విగ్రహాన్ని, ఆయన సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే మ్యూజియంను హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించి తెలంగాణ సాహిత్యానికి గౌరవనివాళి అర్పించాలని పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. వేములవాడ–బోధన్ ప్రాంతంలో జన్మించిన పంపన కన్నడ రాజసభలో వెలుగొందినా, తన చివరి దశను స్వజన్మభూమి బోధన్‌లోనే గడిపిన నికార్సైన తెలంగాణ బిడ్డ అని ఆయన పేర్కొన్నారు. 11 వందల సంవత్సరాల క్రితమే “విక్రమార్జున విజయం” అనే మహాకావ్యాన్ని రచించినప్పటికీ, ఆ గ్రంథం ఇప్పటివరకు తెలుగులో అనువాదం కాలేదని, తెలుగు సాహిత్య చరిత్రలో ఖాళీగా మిగిలిన ఆ శూన్యాన్ని అక్షరయాన్ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి చొరవతో భాషా పండితుడు, ప్రముఖ సాహితీవేత్త జోస్యుల సదానంద శాస్త్రి దాదాపు నాలుగేళ్ల శ్రమతో నింపారని తెలిపారు. ఈ అనువాద గ్రంథం తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అక్షరయాన్, అభిజ్ఞ భారత్, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట సెస్ బిపిఆర్ విఠల్ ఆడిటోరియంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాతృభాషను మరచిపోతే మనుగడ ఉండదని, అయితే ఇతర భాషల పట్ల దురభిమానం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంత భాషే మాతృభాష అవుతుందని, అందువల్ల అన్ని మాతృభాషలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ శతాబ్దాలుగా అన్ని భాషల వారికి నిలయంగా నిలిచిందని, అందరినీ గౌరవించే విశాల హృదయం తెలంగాణ ప్రజలదని, దానికి హైదరాబాద్ నగరమే ఉదాహరణ అని పేర్కొన్నారు.

అక్షరయాన్ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ మాతృభూమి, మాతృదేశం, మాతృభాష ఈ మూడూ ప్రపంచ ప్రజలకు నిత్య స్ఫూర్తి ప్రదాతలని చెప్పారు. బోధన్‌లో పంపన నడయాడిన నేలలో పుట్టిన తానుగా, తన జన్మభూమికి సాహిత్యపరంగా ఏదో చేయాలనే తపనతో ఈ బృహత్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదింపజేయాలనే సంకల్పం కలిగిందని వివరించారు.

విక్రమార్జున విజయం అనువాదకుడు జోస్యుల సదానంద శాస్త్రి మాట్లాడుతూ, పండితులు గణేశ్, హంప నాగరాజు, సుబ్రహ్మణ్యం కెందోళె తదితరులతో జరిగిన చర్చలు, భాషా విశ్లేషణలు ఈ గ్రంథానువాదానికి మరింత లోతు తీసుకువచ్చాయని చెప్పారు. పద్యం, అర్థం, తాత్పర్యంతో కూడిన ఈ గ్రంథం మొత్తం 1670 పేజీలకు విస్తరించిందని తెలిపారు. ప్రచురణకు సహకరించిన శాంతా వసంతా ట్రస్ట్ వరప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పుస్తక రచన ఒక ఎత్తయితే ప్రచురణ మరొక ఎత్తు అని హంపన పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్నడ పండితుల పద్యపఠనం, హాస్యస్ఫోరక ప్రసంగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహాకవి పంపన జాతీయ పురస్కారం స్వీకరించిన మామిడి హరికృష్ణ తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రాంతీయ పాత్ర అనన్యసామాన్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ సాహితీవేత్తల కృషి సరైన రీతిలో రికార్డు కాలేదని, పంపన పేరు తెలుగు సాహిత్య చరిత్రలో స్థానం పొందకపోవడం దానికి ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను పంపన ప్రాతిపదికగా యుగ విభజన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బోధన్ ప్రాంతంలోని ఆయన సమాధి, శిలాశాసనాలను పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు మామిడి హరికృష్ణకు స్వర్ణ కంకణం ధరింపజేసి మహాకవి పంపన జాతీయ పురస్కారాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జోస్యుల సదానంద శాస్త్రి, హం.ప. నాగరాజయ్య, కె.ఆర్. గణేశ్, సుబ్రహ్మణ్యం కెందోళె, కందకుర్తి యాదవరావు పురస్కారాలు అందుకున్నారు. భాషాసేవ విశిష్ట పురస్కారాలను వసుంధర రెడ్డి, మహిపాల్ రెడ్డి (రసగీతి వ్యవస్థాపకులు), విఠల్ జోశి (కన్నడ సాహిత్య పరిషత్తు తెలంగాణ), పురాణే అజయ్ కుమార్ (పంపపీఠం బోధన్) అందుకున్నారు. స్ఫూర్తి పురస్కారాలను చిలుకూరి శాంత–రామ ఉమా మహేశ్వర శర్మ, గడ్డం మోహనరావు అందుకున్నారు. ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కార గ్రహీతలైన ఒగ్గు రవి, డప్పు భాస్కర్, పేరిణి రాజ్‌కుమార్, పేరిణి సందీప్, సినీ దర్శకుడు అక్షరలను స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల సందర్భంగా అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, అభిజ్ఞ భారత్ సంస్థ ప్రతినిధి డాక్టర్ దుంపా శ్రీదేవి, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ రాణి నల్లమోతును కూడా సత్కరించారు. కార్యక్రమానికి కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.