తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా పలు రకాల ఉపకరణాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ పథకం కింద బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5జీ స్మార్ట్ఫోన్లు పంపిణీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తులు OBMMS పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసి అవకాశం రాని వారు కూడా ఈసారి మళ్లీ అప్లై చేసుకోవచ్చని కార్పొరేషన్ స్పష్టం చేసింది. దివ్యాంగులు స్వయం ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల్లో మెరుగ్గా రాణించేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
అర్హతలు – పరికరాల వారీగా
బ్యాటరీ వీల్చైర్లు:
80 శాతం శారీరక వైకల్యం ఉన్నవారు లేదా మస్క్యులర్ డిస్ట్రోఫీ, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ కారణంగా 40 శాతం వైకల్యం ఉన్న 12 నుంచి 55 ఏళ్లలోపు దివ్యాంగులు అర్హులు.
మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్:
చిరు వ్యాపారాల కోసం ఈ వాహనాలను అందిస్తున్నారు. 40 శాతం శారీరక వైకల్యం ఉన్న 18 నుంచి 55 ఏళ్లలోపు వారు విద్యార్హతతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాప్‌టాప్‌లు:
డిగ్రీ, పీజీ లేదా అంతకుమించిన విద్యను అభ్యసిస్తున్న శారీరక, దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులు తమ అర్హతలను బట్టి లో-ఎండ్ లేదా హై-ఎండ్ ల్యాప్‌టాప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్యాబ్‌లు, 5జీ స్మార్ట్ఫోన్లు:
పదో తరగతి, ఇంటర్ చదువుతున్న లేదా పూర్తి చేసిన దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు వయస్సు, వైకల్య శాతం ఆధారంగా అర్హులు.
సంప్రదింపు వివరాలు
దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే, చైర్మన్ కార్యాలయం ఇన్చార్జి రజినిని 99595 83502 నంబర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

