పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారగా, పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను గంటకు 25 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని యంత్రాంగం హెచ్చరించింది.