పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీలు తరలింపు
NEWS Aug 10,2026 10:12 am
ఎల్ నినో ప్రభావంతో క్రిష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గింది. అయితే చంద్రబాబు విజన్ తో ప్రారంభించిన పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ లో గోదారమ్మ నీటి పరవళ్లు తొక్కుతోంది.ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్ ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17.52 టిఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు. పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపధ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు.డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో సమర్థ నీటి నిర్వహణ ద్వారా సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చన్నారు. దీనిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు.