అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. భూ వివాదం నేపథ్యంలో జడ్పీటీసీపై కొంతమంది కత్తులతో దాడిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద నూకరాజుకు పది ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని కొందరు గిరిజనులు ఆ భూమి తమ సొంతం అంటూ పలుమార్లు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. మధ్యవర్తిత్వం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం రక్తపాతానికి దారితీసింది.