ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం
NEWS Oct 04,2025 10:57 pm
దేవీపట్నం: 2025 మెగా డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్)లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరుతో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఆదివాసీ హక్కులు–ఉద్యోగాల సాధన కమిటీ సలహాదారు తెల్లం శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేవీపట్నం మండలం, దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం రామాలయంలో శనివారం జరిగిన ఆదివాసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి కమిటీ డివిజన్ ప్రెసిడెంట్ మడి మురళి దొర అధ్యక్షత వహించారు. పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.