కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
NEWS Aug 25,2026 04:25 pm
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో వివరించారు. చిన్నప్పటి నుంచే తండ్రికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో చదువుపై శ్రద్ధ పెట్టానని సౌజన్య పేర్కొన్నారు. 2018లో తనకు అండగా నిలిచిన సోదరుడు సతీష్‌ను కోల్పోయానని తెలిపారు. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ తన కుమారుడు రియాన్ష్ ద్వారా కుటుంబ వివరాలు తెలుసుకుని తనకు దగ్గరయ్యాడని, ఆ తర్వాత వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని ఆరోపించారు.
తన మాట వినకపోతే దాడి చేసేవాడని, అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అయితే కుమారుడు రియాన్ష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గానని తెలిపారు. విషయం భర్తకు చెప్పడంతో ఆయన్నూ తీవ్రంగా కొట్టడంతో భయపడిపోయారని పేర్కొన్నారు.
తన కుమారుడు చదువుతున్న పాఠశాలలోనే సాధిక్ కోచ్‌గా చేరి, ఏదైనా తేడా జరిగితే రియాన్ష్‌ను కిడ్నాప్ చేసి తనను నియంత్రిస్తానని బెదిరించాడని ఆరోపించారు. దీంతో తాను తీవ్ర భయాందోళనలకు గురయ్యానని, రోజూ నిద్రమాత్రలు పక్కన పెట్టుకునే పరిస్థితికి చేరుకున్నానని లేఖలో తెలిపారు.
తన భర్తను హత్య చేయడానికి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను కెనడా నుంచి ముంబయికి తెప్పించి, వాటిని భర్తకు ఇచ్చి చంపేశాడని సౌజన్య ఆరోపించారు. భర్త మరణం అనంతరం తనను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నాడని, ఇంటి తాళాల నుంచి ఆస్తుల పత్రాల వరకు తన ఆధీనంలో ఉంచుకున్నాడని పేర్కొన్నారు.
తన తల్లి, కుమారుడి పేరుతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐలో ఉన్న పథకాలు, బ్యాంకు నిల్వలను అనాథ శరణాలయాలకు ఇవ్వాలని ఆమె లేఖలో కోరారు.
తనపై 24 గంటలూ నిఘా పెట్టేవాడని, వాట్సప్ బిజినెస్ ద్వారా తన ఫోన్ కాల్స్, కదలికలను పర్యవేక్షించేవాడని ఆరోపించారు. అతడి వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పినా తగిన స్పందన రాలేదని, భర్తను హత్య చేసిన విషయాన్ని చెప్పినా తేలిగ్గా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త ఫ్లాట్‌లో తనను బంధిస్తానని, తండ్రి అడ్డొస్తే ఆయన్ను కూడా చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. తన తల్లి, తండ్రి, కుమారుడు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని, తన కుమారుడిని ఉగ్రవాదులకు విక్రయిస్తానని కూడా బెదిరించాడని లేఖలో పేర్కొన్నారు.
ఇస్లాంలోకి మారాలని, ప్రతిరోజూ ఇస్లాం మతానికి సంబంధించిన పుస్తకాలు చదివి నోట్స్ రాయాలని తనపై ఒత్తిడి తెచ్చేవాడని సౌజన్య ఆరోపించారు. అయితే ఎన్ని హింసలు ఎదురైనా చివరి వరకు తన ధర్మాన్ని వీడలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తుల వల్ల నిజమైన ముస్లింలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఆత్మహత్యకు పాల్పడటానికి పది రోజుల ముందు మూడు రోజుల పాటు తనను తీవ్రంగా కొట్టాడని ఆరోపించారు. ఉప్పాడ సముద్ర తీరానికి తీసుకెళ్లి సముద్రంలోకి తోసేసి, తిరిగి బయటకు లాగాడని, ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తానని బెదిరించాడని లేఖలో వివరించారు.
తన బాధను ఇక భరించలేని స్థితికి చేరుకున్నానని, తాను మరణిస్తే తన కుమారుడికి రక్షణ ఉండదనే ఆందోళనతోనే కుటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకున్నామని సౌజన్య లేఖలో పేర్కొన్నారు. లేఖ రాస్తున్న సమయంలో తన చేతులు వణికాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.