గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకులకు తమదైన రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు డయల్-100కు సమాచారం అందింది. దీంతో శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఘటనాస్థలానికి వెళ్లారు. అదే సమయంలో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బైక్ తాళాలను హెడ్ కానిస్టేబుల్ తీసుకోవడంతో యువకులు ఆగ్రహానికి గురయ్యారు. శ్రీకాళహస్తి కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్.. హెడ్ కానిస్టేబుల్ రమణయ్యతో వాగ్వాదానికి దిగి, ఆయన కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా కత్తి తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. యూనిఫాంలో ఉన్న పోలీసుపై యువకులు దౌర్జన్యంగా వ్యవహరించడంపై పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.