గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకు వస్తే.. తన రక్తం మరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. డ్రోన్ ఎగరేశారని అరెస్ట్ చేసి.. బిడ్డ పెండ్లికి వెళ్లకుండా చేసినా.. రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదని.. వాళ్లపై చర్యలు తీసుకోవడానికి ఆయనకు చేతకావడం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలోనూ ఆ ఆధారాలు, సాక్ష్యాలు చూపించారని.. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని ఎద్దేవా చేశారు.