ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక – మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
NEWS Jan 20,2026 11:48 pm
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్ర గిరిజన సంస్కృతి, ఆత్మగౌరవం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తోంది. ములుగు జిల్లాలోని మేడారం అరణ్య ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా జాతర… కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు… అది ఆదివాసీ చరిత్రకు జీవంత సాక్ష్యం.
2026 సంవత్సరంలో ఈ జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు.
---
వీరగాథగా మారిన సమ్మక్క కథ
చరిత్ర పుటలను తిప్పితే… 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించిన ఆదివాసీ దొర మేడరాజు కుమార్తె సమ్మక్క. ఆమె వివాహం మేడారం పాలకుడు పగిడిద్దరాజుతో జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న సంతానం.
కాకతీయ రాజ్యానికి చెల్లించాల్సిన కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. కరువు, కాటకాల వల్ల కప్పం చెల్లించలేని పగిడిద్దరాజు… కాకతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై భారీ కాకతీయ సేనలు దాడి చేశాయి.
---
స్త్రీ శక్తి ఎదుట సామ్రాజ్య సేనలు
సాంప్రదాయ ఆయుధాలతోనే పోరాడిన పగిడిద్దరాజు, సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా యుద్ధం చేశారు. అయినా సుశిక్షిత కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు యుద్ధంలో వీరమరణం పొందారు. పరాజయ వార్త విన్న జంపన్న… అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
యుద్ధ భూమిలో మిగిలిన సమ్మక్క… కాకతీయ సైన్యానికి ముప్పతిప్పలు పెట్టింది. ఒక ఆదివాసీ మహిళ చూపిన యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడన్నది గిరిజనుల నోట నేటికీ వినిపించే కథ. చివరికి శత్రువుల దాడిలో గాయపడిన సమ్మక్క… రక్తపు ధారలతోనే యుద్ధ భూమి విడిచి చిలుకల గుట్ట వైపు వెళ్లి… మార్గమధ్యంలో అదృశ్యమైందని విశ్వాసం.
---
పుట్టలో వెలసిన దేవత
సమ్మక్క కోసం వెతికిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలతో కూడిన కుంకుమ భరణ లభించింది. దాన్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క – సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
---
2026 జాతర విశేషాలు
28-01-2026: కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకురావడం
అదే రోజు: కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజులను గద్దెలపై ప్రతిష్ఠ
29-01-2026: చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠ
30-01-2026: సంపూర్ణ మొక్కుల చెల్లింపు
31-01-2026 సాయంత్రం: దేవతలను తిరిగి వన ప్రవేశం చేయడం
ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే… వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు. పూర్తి స్థాయిలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే పూజలు జరుగుతాయి. భక్తులు తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు బెల్లం (బంగారం) నైవేద్యంగా సమర్పించడం విశేష ఆచారం.
---
ఆచారమే కాదు… ఒక ఉద్యమం
సమ్మక్క సారలమ్మ జాతర… కేవలం భక్తి కాదు. అది ఆదివాసీ హక్కుల కోసం సాగిన పోరాటానికి గుర్తు. సామ్రాజ్య శక్తులకు ఎదురు నిలిచిన గిరిజనుల ఆత్మగౌరవానికి నిదర్శనం. అందుకే మేడారం… నేడు ఒక అరణ్య ప్రాంతం మాత్రమే కాదు… కోట్లాది భక్తుల మనసుల్లో వెలిగే పవిత్ర ఉద్యమ స్థలం.