మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకొని గ్రామస్థుల నిరసన
NEWS Jan 06,2026 04:00 pm
మంచిర్యాల జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనుల కోసం వెళ్లే మట్టి లారీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జైపూర్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నర్సింగాపూర్ బస్టాండ్ సమీపంలో గ్రామస్థులు మట్టి లారీలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం కోసం పరిమితికి మించి మట్టిలోడుతో పాటు మితిమీరిన వేగంతో లారీలు వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలపై టార్పాలిన్ కప్పకపోవడంతో దుమ్ము–ధూళి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లారీల వేగం వల్ల ప్రమాద భయం నెలకొందని పేర్కొంటూ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.