నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో ఓటర్ జాబితాలో అవకతవకలపై ప్రజా చైతన్య వేదిక మహిషా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పట్టణవాసులు, నాయకులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి బోగస్ ఓట్లు తొలగించాలి, భైంసాను కాపాడాలి, భైంసా పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్‌కు బోగస్ ఓట్లను తొలగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.